Sunday, January 16, 2011

ఆర్నెల్ల రాజులం ..... పందెం కోడి జన్మ

మా మెను చెప్పానంటే మీ అందరికీ జీవితంలో ఒక్కసారైనా పందెం కోడి జన్మ ఎత్తితే బాగుండుననిపిస్తుంది. ఉదయం ఉడకబెట్టిన కోడి గుడ్డుని చిన్న ముక్కలుగా చేసి వేస్తారు, తరువాత ఐదారు బాదం పప్పులు లేదా పిస్తా పెడతారు. ఓ గంట తరువాత పచ్చిమాంసాన్ని కైమా చేసి తెచ్చిస్తారు. బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తరువాత ఎనిమిదింటి నుంచి పదింటి వరకూ సన్‌బాత్ ఇస్తారు. తరువాత మొహం మీద చల్లటినీళ్లు కొట్టి నీడలో కట్టేస్తారు. మధ్యాహ్నం వడ్లు, సోళ్ల్లు, సజ్జలు మొదలైనవి ఆహారంగా పెడతారు.
సంక్రాంతికి రెండు నెలల ముందు నుంచి మార్నింగ్ వాకింగ్‌లు, ఈవినింగ్ స్విమ్మింగ్‌లు ఉంటాయి. పందేనికి నెల రోజులు ఉందనగా బాడీ మసాజ్‌లు, స్టీమ్‌బాత్‌లు కూడా ఉంటాయి. ఒళ్లు రాటు తేలడానికి, ఒంట్లో చురుకు పెంచడానికి ఏమి చేయాలో అవన్నీ చేస్తారు. లేటెస్ట్ ఏంటంటే...విటమిన్ టాబ్లెట్లు కూడా ఇస్తున్నారు. వారానికోసారి పందెం రిహార్సల్స్ వేస్తుంటారు. వాటిలో ఏమైనా గాయాలయితే రెడీగా డాక్టర్లుంటారు. ఇది కాకుండా ప్రతి వారం డాక్టరు చెకప్ ఉంటుంది.

ఆ నెలంతా కాపలా...

డిసెంబర్ నెలొచ్చిందంటే మా యజమానులు ఊరు దాటి బయటికి వెళ్లరు. పెళ్లయినా, చావైనా ఇలా వెళ్లి అలా వచ్చేస్తారు. కొందరయితే వేటినీ పట్టించుకోకుండా మా చుట్టూనే తిరుగుతుంటారు. ముఖ్యంగా రాజులయితే పొద్దున లేవగానే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని తేరిపార చూసుకుని మీసం మెలేసుకుంటారు. 'ఏరా...రాజా ఈసారి మనదేనా గెలుపు' అంటుంటారు. మా భాష వారికి అర్థం కాదు కాని 'గెలుపు మీకు చావు మాకు' అని మేమంటాం.

వ్యక్తిగత కేంద్రాలుంటాయి...

పందెం కోడిని పెంచడం ఒకప్పుడు సరదానేమో గాని ఇప్పుడు మాత్రం నూటికి నూరుపాళ్లు వ్యాపారం. చాలామంది రైతులు పది నుంచి పాతిక వరకూ పందెం కోళ్లను పెంచుతారు. కొందరయితే వ్యక్తిగతంగా కేంద్రాలు పెట్టుకుని వందల్లో పెంచుతారు. మిగతా వ్యాపారాల సంగతి మాకు తెలియదు గాని మా విషయంలో మాత్రం పెట్టిన రూపాయి ఎక్కడికీ పోదు. రూపాయికి పది రూపాయలు వస్తాయి. అదెలా అంటారా....పందెం సమయంలో ఒక్కో కోడి ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖరీదు చేస్తుంది. ఓ పది కోళ్లు అమ్ముకుంటే చాలు లక్ష రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. దాంతో వేల సంఖ్యలో పందెం కోళ్ల మారకం జరుగుతుంది. కొందరికి మమ్మల్ని పెంచి పందెం ఆడడం సరదా అయితే హైదారాబాద్ నుంచి వచ్చే బడా సాబ్‌లకు అప్పటికప్పుడే కోడిని కొని పందెం ఆడడం సరదా. దాంతో ఆడేవాళ్లకంటే అమ్మేవాళ్లే ఎక్కువుంటారు.

పంచాంగం చెబుతారు...

మనుషులకేనా...మాకూ పంచాంగం చెప్పేవారున్నారు. పందేనికి ఇంకా పది రోజుల సమయం ఉందనగా పంచాంగం చెప్పేవారు వీధుల్లోకి దిగుతారు. ఏ సమయంలో కోడి పోటీలోకి దిగితే మంచిది, ఏ రంగు కోడితో పోటీకి దిగితే గెలుస్తుంది? వంటి విషయాలు పంచాంగం చెప్పించుకుని తెలుసుకుంటారు. ఆ పదిరోజుల్లో జోస్యం చెప్పేవారికి బోలెడు గిరాకీ. వారికి పెద్దమొత్తాలే చెల్లిస్తారు.

కత్తులు కట్టేవారున్నారు...

పూర్వం కోడి పందేలంటే రెండు కోడి పుంజులు పొడుచుకున్నప్పుడు....ఓడిపోయే పుంజు పారిపోతుంది. నిలబడ్డ పుంజు గెలిచినట్టు. రానురాను పద్ధతి మారింది. మా కాళ్లకు కత్తులు కట్టడం మొదలుపెట్టారు. దాంతో ఎదుటి కోడి ఓడడం కాదు చావాల్సిందే. ఈ కత్తులు ఎవరుపడితే వారు కట్టలేరు. ఈ పనికి ప్రత్యేకంగా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. సంక్రాంతి సమయంలో కత్తి కట్టేవారి వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. కొంతమంది కత్తి కట్టినందుకు ఇంత డబ్బుకావాలని అడుగుతారట. కొందరయితే గెలుపులో పదిశాతం వాటా అడుగుతారట. అయితే ఆ టైంలో పోలీసులు కత్తులు కట్టేవాళ్లని తీసుకెళ్లి లాకప్‌లో పెడతారట. అలాగయినా కొంతవరకూ పందేలజోరును తగ్గించవచ్చని. అయినా దొంగచాటున కట్టేవాళ్లు కొందరుంటారు.

అంతా మోసమే...
మోసం లేకుండా ఏది నడుస్తుంది. మా ఆటే వ్యాపారం అయినపుడు గెలవడం కోసం ఎంతో కొంత మోసం చేయకపోతే ఎలా? అందుకే మా కాళ్లకు కట్టే కత్తులకు విషం రాస్తారు. దాంతో ఆ కత్తి ఎదుటి కోడికి ఎక్కడ తగిలినా వెంటనే ప్రాణాలు వదులుతుంది. అలాంటపుడే పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. కత్తికి విషం రాసినట్టు గుర్తిస్తే పోటీదారులు ఊరుకోరు. కర్రలతో యుద్ధాలకు వచ్చేస్తారు. అలాంటపుడు చూసే వీక్షకులు కూడా గాయపడతారు. క్రికెట్‌లాంటి ఆటల్లోనే కాదు మా పోటీల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌లు ఉంటాయి. అదెలా అంటారా..చిన్న ఉదాహరణ చెబుతాను. నా యజమాని మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే..నాకు బాగా శిక్షణ ఇచ్చి ముందురోజు ట్రయిల్ వేస్తాడు.

ఎదుటి కోడిని బాగాతన్ని గెలుస్తాను. అప్పుడు అందరి దృష్టి నాపైనే ఉంటుంది. నన్ను కొనుక్కుంటానని ముందుకు వచ్చినవారికి మర్నాడు రమ్మని చెబుతాడు. ఆ రోజు రాత్రి నన్ను తలకిందులుగా చెట్టుకు కట్టేస్తాడు. మర్నాడు ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి అమ్మేస్తాడు. పందెంలో నాకు పోటీగా నా యజమానే మరో కోడిని వదిలి పెద్ద మొత్తంలో పందెం కాస్తాడు. రాత్రంతా తలకిందులుగా వేలాడ్డం వల్ల కాళ్లు బాగా నొప్పులు పెడతాయి. దాంతో పందెంలో నేను ఖచ్చితంగా ఓడిపోతానని నా యజమానికి తెలుసు. అందుకే నమ్మకంగా పందెం కాస్తాడు. అతను అనుకున్నట్టుగానే నేను ఓడిపోతాను. తనకి బోలెడు డబ్బులొస్తాయి. ఇలా...డబ్బుకోసం ఎన్నెన్ని మోసాలు చేస్తారో.

పందెం కోడితో ఆవకాయలు...

మా తన్నులాట ప్రేక్షకులకి చిరంజీవి సినిమా కంటే బాగుంటుంది. అందుకే సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలకు లక్షల మంది వస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. చూడ్డానికే కాదు లక్షల డబ్బులతో పందేలు కాస్తారు. కోట్ల వ్యాపారం జరుగుతుంది. రాజకీయ రంగంలోని ప్రముఖులు, సినీరంగంలోని ప్రముఖులు మా పందేలకు స్పెషల్ ఎట్రాక్షన్స్. పాపం ఎంత దొంగచాటున వచ్చినా పోలీసులకు దొరికిపోతారు.

కోడి పందేలు అంటే కోడి పందేలతో సరిపెట్టరు కదా...రొయ్యలు, పీతలు, పందెం కోడి మాంసం అంటూ బోలెడు వంటల గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా పందెం కోడి ఆవకాయని అమెరికాలో ఉన్న బంధువులకు పంపడం ఆనవాయితీ. అలాగే వీక్షకుల కోసం ప్రత్యేకంగా కోడి పకోడీలు కూడా వేస్తారు. మామూలు రోజుల్లో ప్లేటు ముప్పైరూపాయిలయితే ఈ సమయంలో వందా, నూటేభైవరకూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే అతిధులకు రకరకాల నాన్‌వెజ్ రుచులను అందించడంలో హోటల్స్ చాలా బిజీగా ఉంటాయి. డిసెంబర్ నెలలోనే హోటల్ రూమ్స్ అన్నీ బుక్ అయిపోతాయి.

పందేలను నమ్ముకుని...

ఒకప్పుడు కేవలం సరదాగా జరుపుకునే కోడి పందేలు కొందరి పాలిట వరాలయ్యాయి. మా మీద లక్షలు సంపాదించేవారున్నారు. పందేల్లో గెలిచి వందల ఎకరాల భూములు కొన్నవారున్నారు. అలాగే మమ్మల్ని నమ్ముకుని నాశనమైనవారూ ఉన్నారు. వారెవరంటారా? కరెక్టుగా పందెం సమయానికి వచ్చి అక్కడి సందడిలో మునిగిపోయి కొనబోయే కోడి గురించి తెలుసుకోకుండా గొప్పకొద్దీ లక్షల్లో పందెం కాసినవారు ఓడిపోతారు. అలాగే మోసాలకు బలైనవారు కూడా చాలామంది ఉంటారు.

అయితే మా పందేల్లో ఎవరు ఎంత డబ్బు సంపాదించారు, ఎంత పోగొట్టుకున్నారు అనే విషయాలు ఎక్కువగా బయటికిరావు కాబట్టి మీకు వాటి గురించి అంతగా తెలియదు. సెన్సెక్స్ ఉత్థానపతనాల్లాగా వీటి గురించి కూడా ఆ మూడు రోజులూ టి.విలో చెపితే పందేలు ఆపడం మానేస్తారేమో. లేదా జాగ్రత్తపడి పెట్టుబడులు తెలివిగా పెట్టుకుంటారేమో. అయినా అదంతా మాకెందుకు? ఆరునెలలుగా చావు కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఏదో ఒక రోజు చచ్చేవాళ్లమే కదా! మళ్లీ సంక్రాంతికి కనిపిస్తాం.(నేను కాదనుకోండి, మా వాళ్లు) అంతవరకు సెలవు.

సత్యం వారి కోళ్లు

సత్యం రామలింగరాజు తండ్రి బైర్రాజు సత్యనారాయణ పందెం కోళ్లను పెంచడంలో ప్రసిద్దుడు. ఆయన దగ్గర ఎప్పుడూ వందల సంఖ్యలో పందెం కోళ్లు ఉండేవి. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్డు కట్టించి పెంచేవారు. పందెం కోళ్ల సేకరణకు దేశంలోని చాలా చోట్లకి వెళ్లేవారు. కోయంబత్తూరు నుంచి విమానంలో కూడా కోళ్లని తీసుకొచ్చేవారట. కోళ్లు వాకింగ్ చేయడం కోసం జపాన్ నుంచి ప్రత్యేకంగా ట్రెడ్‌మిల్‌ని కూడా తెప్పించారు. ఏటా హైదరాబాద్ నుంచి చాలామంది ప్రముఖుల్ని గోదావరి జిల్లాలోని జువ్వలపాలెం తీసుకెళ్లి ప్రత్యేక మర్యాదలు చేసి కోడి పందేలు చూపించేవారు.

No comments:

Post a Comment