Saturday, January 8, 2011

కోడి రెఢీ! * ముందే చేతులెత్తేసిన పోలీసులు

సిద్ధమవుతున్న కోడి పందాల బరులు
ముందస్తు సంకేతాలతో పందాలరాయుళ్లలో హుషారు
ఏటా చేతులు మారుతున్నది రూ. వందకోట్ల పైమాటే


ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సీజన్‌లో కోడి పందాలు పోలీసుల పరువుకు, ప్రజాప్రతినిధుల పంతాలకు మధ్య యుద్ధంలా జరుగుతు న్నాయి. ఏమైనా సరే జూదాలను అనుమతించమని ఖాకీలు భోగి ముందురోజు వరకూ బీరాలు పలకడం.. ఆటలు సాగనివ్వాలని రాజకీయ నాయకులు పట్టుపట్టి చివరికి గెలుపు సాధించడం ఎప్పుడూ పరిపాటే. అయితే ఈ సారి సీన్ మారింది. ఎందుకొచ్చిన గొడవనుకున్నారో.. ఏమో పోలీసులు ముందే చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో కోడిపందాల జాతరకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ముందస్తు సంకేతాలతో పందాలరాయుళ్లలో హుషారు ఉప్పొంగుతోంది. కోడి పందాల బరులను సిద్ధం చేస్తున్నారు.


  సంప్రదాయం ముసుగు.. ఆనవాయితీ అవకాశం వెరసి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఏటా పందెం కోళ్లు కత్తులు దూస్తూనే ఉన్నాయి. పోలీసుల హెచ్చరికలను సైతం బేఖతారు చేస్తూ ఉన్నతస్థాయి అనుమతితో పెద్దలు సాగించే ఈ జూద క్రీడ అడ్డూ అదుపూ లేకుండానే సాగుతోంది. జిల్లాలో ప్రతి ఏటా కనీసం రూ.100 కోట్లకు పైబడిన సొమ్ము చేతులు మారుతూ ఉంటుంది. అన్ని రాజకీయపార్టీల్లో ఉండే పెద్దలు వ్యక్తిగత విభేదాలను, రాజకీయాలను పక్కనపెట్టి మూడు రోజులపాటు జూదాల జాతరను నిర్వహిస్తుంటారు. మనకెందుకు వచ్చిందిలే అంటూ పోలీసులు ముందస్తు సంకేతాలు ఇవ్వడంతో ఈ సారి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున పందాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.

గత రెండు రోజులుగా దీనిపై నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని భీమవరం ప్రకృతి ఆశ్రమం సమీపంలోనూ, అయిభీమవరం, జువ్వలపాలెం ప్రాంతాల్లో భారీ పందాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, కాళ్లకూరు, నల్లజర్ల, లింగపాలెం, అనంతపల్లి, ద్వారకాతిరుమల, దువ్వ, యండగండి, మహాదేవపట్నం, పెన్నాడ,మొగల్తూరు ఇలా సుమారు మరో 60 కేంద్రాల్లో ఒక మోస్తరు పందాలు నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల్లోని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.


ఇక జిల్లాలో వందకు పైగా గ్రామాల్లో చిన్నాచితక పందాలకు తెరలేవనుంది. కోడి పందాలతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటి జూదాలకు అవకాశం ఇచ్చేలా కోడిపందాల నిర్వాహకులతో పందేలరాయుళ్లు చర్చలు జరుపుతున్నారు. పేకాటలను నిర్వహించుకోనిస్తే కోడి పందాల నిర్వాహకులకు రోజుకు కొంత మొత్తాలను లీజుగా అందించేలా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు.


గత ఏడాది ఏం జరిగిందంటే..

మరోమారు సంక్రాంతి కోడిపందాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. గత ఏడాది కూడా కోడి పందాలు జరిగిన తీరును పలువురు ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. గత సంక్రాంతికి 20 రోజుల ముందునుంచే గ్రామాల్లో కోడి పందాల నిర్వహణను అడ్డుకుంటూ పోలీసులు హంగామా మొదలైంది. గత సంక్రాంతికి రెండు నెలల ముందే అప్పటి డీఐజీ మహేష్ ఎం భగవత్ జిల్లాకు రావడంతో ఆయన జూదాలపై ఉక్కుపాదం మోపారు. కింది స్థాయి పోలీస్ అధికారులకు, సిబ్బందికి కోడి పందాలను అడ్డుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

అప్పటికే ఏఎస్పీ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న నర్సాపురం డీఎస్పీ వెంకట్రామిరెడ్డి ఈ ఒత్తిడిని తట్టుకోలేక ముందుగానే సెలవుపై వెళ్లిపోయారు. ఇక మిగిలిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కోడి పందాలను అడ్డుకుంటే రాజకీయ ఒత్తిళ్లు, కోడి పందాలను చూసీ చూడనట్టు వదిలేస్తే ఉన్నతాధికారి నుంచి క్రమశిక్షణ చర్యల భయం..ఇలా అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా నలిగిపోయారు. ఎట్టకేలకు జిల్లాకు చెందిన కీలక నేతల ఒత్తిడితో ఆ మూడు రోజులు కోడిపందాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ఎలాగు కోడి పందాలు జరిగిపోవడంతో కొందరు పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మామూళ్లు దండుకున్నారు.


రాజకీయాలకు అతీతంగా పందాలు

ఎవరూ ఏ పార్టీ అయినా.. కోడి పందాల విషయంలో వారంతా ఒక్కటే. సంక్రాంతి సరదాను అనుభవించేందుకు అంతా కలిసి కోడి పం దాలు జరిపి తీరతారు. ఈ విషయం లో పోలీసులను, చట్టాలను సైతం వారు పట్టించుకోరు. ఆ మూడు రోజుల్లో మినహా మరెప్పుడు అంత పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించిన దాఖలాలు ఉండవు. పార్టీలు, పట్టింపులకు తావులేకుండా అందరూ కలిసి రెండు ప్రాంతాల్లో కోడి పందాలను పెద్ద ఎత్తున నిర్వహించేలా అంగీకారం కుదుర్చుకుంటారు. పట్టుకలిగిన నేతలు కోడి పందాలను నిర్వహించి వాటిని వీక్షించి సరదా తీర్చుకుంటారు.

నిర్వాహకులు మాత్రం కేవుల్ రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. వాటిలో నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని గ్రామాభివృద్ధి, సంఘాభివృద్ధి పేరుతో జాగ్రత్తపెడతారు. అవి ఏమేరకు సద్వినియోగం అయ్యింది అనేది వారికే ఎరుక. ప్రతిసారి ఖాకీ ఓడింది అన్పించుకోవడం ఎందుకు ఈ సారి మనమే చేతులెత్తేస్తే మంచిదనుకున్న పోలీస్ దొరలు ముందే చేతులెయ్యడంతో కోడి పందాల నిర్వాహకులు మరింత ‘బరి’తెగించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

No comments:

Post a Comment