Thursday, January 13, 2011

బరి రెఢీ! జిల్లాలో కోడిపందాలజోరు ...

సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడిపందాలు, జూదాల జాతరకు రంగం సిద్ధమైంది. రాష్ర్టం నలుచెరగుల నుంచి పందాల రాయుళ్ల ఆగమనం ఆరంభమైంది. శుక్రవారం భోగి పం డుగ నాడు పందాలకు తెరలేవనుంది. కత్తులు కట్టుకుని కోడి పుంజులు కూడా కాలు దువ్వుతున్నాయి. ఓకే.. రెడీ.. స్టార్‌‌ట అంటూ.. నిర్వాహకు లు పందాలకు పచ్చ జెండా ఊపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పోలీ సులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించేందుకే మొగ్గు చూపుతున్నారు.

పచ్చని పశ్చిమ గోదావరిలోని గ్రామ గ్రామాన పందెం పుంజులు పౌరుషాన్ని చూపించనున్నాయి.. అందుకు అనుగుణంగానే పందాల బరిలు సిద్ధమయ్యాయి. జిల్లాలో ఎటువంటి సిఫారసులు అవసరం లేకుండానే నిర్వాహకులు కోడి పందాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. సుమారు పది కేంద్రాల్లో భారీ పందాలకు, సుమారు 200లకు పైగా గ్రామాల్లో ఒక మోస్తరు పందాలకు ఏరాట్లు సాగాయి. జిల్లాలోని అయిభీమవరం, జువ్వలపాలెం, భీమవరం ప్రాంతాల్లో రాష్టస్థ్రాయి పందాలకు గురువారం ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, అయిభీమవరం ప్రాంతంలో గతం నుంచి పందాలు నిర్వహించే ప్రాంతంలో ఈ సారి ఓఎన్‌జీసీ రిగ్ వేయడంతో ఒక కీలక ప్రజాప్రతినిధికి చెందిన స్థలంలో బరిని ఏర్పాటు చేశారు.

గణపవరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఒక ప్రాంతాన్ని చదునుచేసి భారీ ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్‌లైట్లు, సుమారు 500 కుర్చీల గ్యాలరీని ఏర్పాటు చేసి రాత్రి పగలు కోడిపందాలను నిర్వహించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. పెదవేగి మండలం కొప్పాకలో కోడి పందాలు, పేకాట నిర్వహించుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ ప్రత్యేకంగా టెంట్‌లు ఏర్పాటు చేసి బరిని సిద్ధం చేశారు. భీమవరం సమీపంలోని కొణితివాడ, రాయకుదురు, వీరవాసరం, వేండ్ర, పెన్నాడ, విస్సాకోడేరు, మోగల్లు, ఉండి, కాళ్ళకూరు, యండగండి, మహాదేవపట్నం, తదితర గ్రామాల్లో పందాలకు ఏర్పాట్లు జరిగాయి.

యలమంచిలి మండలం కలగంపూడిలో టెంట్‌లు వేసి భారీ ఏర్పాట్లు చేశారు. పూలపల్లి, లంకలకోడేరు కొంతేరు, యలమంచిలి, వాడ్లవానిపాలెం, గుమ్ములూరు, కవిటం, కొవ్వూరు సమీపంలోని వాడపల్లి, రావూరుపాడు, దేవరపల్లి, ఇటుకలకోట, గూటాల, మార్కొండిపాడు, మీనానగరం, చిక్కాల, తాడేపల్లిగూడెం సమీపంలోని ఆరుగొలను, లింగరాయుడిగూడెం, ఏజన్సీ ప్రాంతమైన నల్లజర్ల, లింగపాలెం, ద్వారకాతిరుమల, కామవరపు కోట, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఒక మోస్తరు పందాలకు ఏర్పాట్లు జరిగాయి.


చెరో రోజు ఒప్పందాలు

ఆర్థిక, రాజకీయ అండదండలు కలిగిన పెద్దలు సాగిస్తున్న జూదక్రీడవైపు పోలీసులు కన్నెత్తి చూసే సాహసం చేయకపోవడంతో డబ్బు సంపాదనకు అవి వేదికలు అవుతున్నాయి. భారీ పందాల్లో కేవుల్ (గుత్త శాతం)కు అలవాటు పడిన పలు ప్రాంతాల్లోని నిర్వాహకులు తమ ప్రాంతాల్లో కోడి పందాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పెద్దలు ముందుగానే మాట్లాడుకుని ఒక రోజు మీ ఊరిలో.. ఒక రోజు మా ఊరి లో పందాలు నిర్వహిస్తామంటూ ఒప్పందా లు కుదుర్చుకుంటున్నారు. ఇలా ఈ సారి ప లు ప్రాంతాల్లో భారీస్థాయలో కోడి పందా లు ఒక్కోరోజు ఒక్కోచోట నిర్వహించేం దుకు అంగీకరించినట్టు సమాచారం.

అతిథి దేవోభవ..
డెల్టాలో జరిగే కోడి పందాల జాతరను చూసేందుకు జూదరులకు రెండు కళ్లు చాలవు. అందుకే విదేశాల్లో ఉన్నా.. రాష్ట్రంలో మరెక్కడ ఉన్నా ‘పశ్చిమ’కు రెక్కలు కట్టుకుని వాలిపోతారు. కోడి పందాలను తిలకించేందుకు వచ్చే మిత్రులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, సినీ తారలు, రాజకీయ నేతలను పశ్చిమ వాసులు రాచమర్యాదలతో చూసి అతిథిదేవోభవ అనే దానికి సరికొత్త అర్థం చెబుతారు. కోడి కోజ (పందెం పుంజు) మాంసానికి ఉన్న క్రేజ్‌తో వాటిని అతిథులకు వండి వడ్డిస్తారు. రాత్రి లాడ్జిలు, అతిథిగృహాల్లో నిద్ర.. పగలు పందాల బరిలో పడిగాపులతో అతిథులు హుషారుగా సంక్రాంతిని గడిపేస్తారు. అందుకే డెల్టా ప్రాంతంలోని భీమవరంలో వారం రోజుల ముందుగానే లాడ్జీలు, అతిథిగృహాలు బుక్ అయిపోవడంతో పండుగ మూడు రోజులు హౌస్‌ఫుల్ కానున్నాయి.

భీమవరం బరిని సిద్ధం చేసిన మునిసిపల్ సిబ్బంది
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడే పురపాలక పారిశుధ్య సిబ్బంది కోడి పందాల బరిని తీర్చిదిద్దడంలో సేవలందించారు. ఈ విషయాన్ని చదవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఆర్థిక, రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు. పట్టణంలోని ఏడో డివిజన్‌కు ఒక ఉద్యోగి చొరవతో సుమారు పది మంది పారిశుధ్య సిబ్బంది గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కోడి పందాలకు ఏర్పాట్లు చేశారు. పురపాలక జీతాలను తీసుకుంటూ ప్రజలకు పారిశుధ్యం సేవలు అందించాల్సిన సిబ్బంది కోడి పందాల నిర్వాహకులు ఇచ్చే సొమ్ము కోసం బరిని శుభ్రం చేయడం గమనార్హం. స్థానిక ప్రకృతి ఆశ్రమం రోడ్డును తుడిచి, కోడి పందాల బరి వద్ద చెత్తను తొలగించి వారు ట్రాక్టర్లతో వాటిని తరలించారు. ట్రాకర్లతో నీరు తెచ్చి గ్రౌండ్ తడిపి, ముగ్గు చల్లి పం దాల రాయుళ్లు వచ్చేందుకు స్వాగత సన్నాహాలు చేయడం అనేక విమర్శలకు తావి స్తోంది. ఈ వ్యవహారంపై మునిసిపల్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

చూసీచూడనట్టుగా పోలీసులు

పందాలను జరగనిచ్చేదిలేదని మొదట బీరాలు పలకడం అటుతరువాత ఎక్కడి వారే అక్కడే గప్‌చిప్ అయిపోవడం జిల్లా పోలీసులకు మామూలే.. ఈసారి కాస్త సీన్ మారింది.. కోడి పందాలపై పోలీసులు ఎటువంటి ప్రకటనలు చేయకుండానే చూసీచూడనట్టు వ్యవహరించాలని దిగువస్థాయి పోలీసులకు ఉన్నతాధికారులు సంకేతాలు ఇచ్చేశారు. కాగా, కోడి పందాలు జరగనీయకుండా చూడాలని, అవి ఏ ప్రాంతంలో జరి గితే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు తప్పవని కొద్ది రోజుల క్రితం ఐజీ ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం. కాగా, జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్ల వారీగా కొందరు ఇదే అదనుగా చేసుకుని ఇద్దరు కానిస్టేబుళ్లను మఫ్టీలో పంపి కోడి పందాల నిర్వాహకుల వద్ద సొమ్ముల కోసం బేరాలు సాగిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



అనధికారిక అనుమతులు వచ్చేశాయ్‌...!
 సంక్రాంతి కోడి పందాల జాతరకు రంగం సిద్ధమైంది. నేటి బోగి పండుగ నుంచి వరుసగా మూడు రోజులపాటు ఈ కోడి పందాల రాక్షస క్రీడ నిర్భయంగా, యథేచ్ఛగా పెద్దఎత్తున ఉత్సవం మాదిరి కొనసాగనున్నాయి. కోడి పందాలకు పల్నాటి చరిత్ర ఉంది. పందాల్లో కేవలం నగదే కాకుండా భూములను, స్ధిర చరాస్తులను కూడా పణంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. జోరుగా సాగే ఒప్పందం పందాల్లో క్షణాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారటం షరా మామూలే. చూస్తున్నంతలోనే ఆస్తులు కరగటం, పెరగటం జరిగిపోతుంది.

సగటు కోడి పందెం రాయుళ్ళు కూడా సంక్రాంతి పేరుతో జూదశాలలకు వెళ్ళి పండగ సరదాను దండగతో ముగించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. కోడి పందాలను నిలుపుదల చేయాలంటూ ప్రతిసారీ మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు పోలీస్‌ అధికారులను డిమాండ్‌ చేస్తూ రావటం పరిపాటిగా మారింది. అయినప్పటికీ ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ సంక్రాంతి కోడి పందాలకు తలాడించటం అంతే ఆనవాయితీగా మారిపోయిందనే విమర్శలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకప్పుడు కోడి పందాలకు జిల్లాలోని డెల్టా ప్రాంతమే పేరొందేదిగా ఉండేది. కానీ రానురానూ ఇటీవల కాలంలో చూస్తే ఏజెన్సీ, మెట్ట ప్రాంతం కూడా కోడిపందాలకు డెల్టాతో ఢీకొనటం జరుగుతోంది. గత ఏడాది అప్పటి డిఐజి మహేష్‌ ఎం.భగవత్‌ మాత్రం ఆఖరి గడియ వరకు ఈ కోడిపందాలకు అడ్డుకట్ట వేస్తూ సమర్ధవంతమైన పోలీసు చర్యలు చేపట్టారు.

ఇదికాస్తా జిల్లాలో పరోక్షంగా పొలిటికల్‌ వర్సస్‌ పోలీస్‌ మధ్యన కోల్డ్‌వార్‌కు దారితీసింది. ఎట్టకేలకు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యతో జిల్లాకు చెందిన ఓ మంత్రి వర్యులు నేరుగా అప్పటి డిఐజితో కోడిపందాలకు అనధికార అనుమతులు ఇప్పించాలంటూ సిఫార్సులు కూడా చేయించారు. దీంతో బోగి పండుగ రోజున మధ్యాహ్నం నుంచి మాత్రమే స్థానికంగా ఉండే పోలీసులకు పందాల గ్రీన్‌ సిగ్నల్‌ రావటం జరిగింది. ఐతే సంక్రాంతి మూడు రోజుల పందాల అనంతరం పోలీసు దాడులు అడపా దడపా జరగటం జరిగింది. కానీ గతానికి భిన్నంగా ఈసారి మాత్రం సంక్రాంతి కోడిపందాలకు సంప్రదాయం ముసుగులో ముందస్తుగానే అనధికార పోలీస్‌ బాసుల అనుమతులు వచ్చాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గ్రామ గ్రామానా సంక్రాంతి కోడి పందాలు జరుగుతున్నాయి.

ఐతే జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, కామవరపుకోట మండలంలోని వెంకటాపురం పందాలు ఈసారి భారీగా సాగనున్నాయి. ఇప్పటికే ఇక్కడ కోడిపందాలను నిర్వహించేందుకు అవసరమైన బిరులు సిద్ధమయ్యాయి. సిమెంట్‌ పోల్స్‌తో పక్కా ఐరన్‌ ఫెన్సింగ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయి. గత రెండేళ్ళుగా శ్రీనివాసపురంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ కోడి పందాలకు రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభోత్సవం చేయటం ఒకింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది కూడా పందెంరాయుళ్ళు ఇప్పటికే బాలరాజుకు రిబ్బన్‌ కట్‌చేసే బంపర్‌ ఆఫర్‌ను ఇచ్చినట్లు సమాచారం. కానీ ఎందుచేతనో ఈసారి మాత్రం బాలరాజు కోడి పందాల ప్రారంభానికి దూరంగా ఉండాలని భావించినట్లు సమాచారం.

ఐతే బాలరాజు రాకున్నట్లైతే ఆఖరి నిముషంలోనైనా సరే ఓ ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ ఉద్దండునితో పందాల బిరిని ప్రారంభించాలనే పట్టుదలతో నిర్వాహకులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదంతా కేవలం పోలీస్‌ దాడుల బెడద నుంచి తప్పించుకునేందుకు, పందాల రాయుళ్ళలో ధైర్యం నింపేందుకే అని అంతా భావిస్తారు. జిల్లాలోని డెల్టా, ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో జరిగే కోడి పందాలకు రాష్ట్ర స్థాయిలో పేరున్న రాజకీయ అమాత్యుల, నేతల కుటుంబాలకు చెందిన సంపన్నులు ఆసక్తితో తిలకించేందుకు వస్తుండటం సంప్రదాయంగా మారింది. రాజకీయంగా అన్ని పార్టీలకు చెందిన నేతలు కోడి పందాల నిర్వహణపై పెదవి విప్పక పోవటం విశేషం.

పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళ మాదిరిగా ఈ సంక్రాంతి కొడి పందాలకు కూడా ముహూర్తాలు పెట్టడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మూడు రోజుల ఈ జాతరలో వందల కోట్ల రూపాయలు జిల్లావ్యాప్తంగా చేతులు మారనున్నాయి. జూదశాలలకు ఒక్కసారిగా రెక్కలు విచ్చుకోనున్నాయి. పేకాట శిబిరాలు రేయింబవళ్ళు నిరంతరాయంగా సాగిపోతాయి. పోలీసు బాసుల కరుణాకటాక్షాల కోసం పందాల, జూదశాలల నిర్వాహకులు ముందస్తుగానే పలుకుబడిగల సంబంధించిన రాజకీయ నేతల సిఫార్సులతో ప్రదక్షిణలు పూర్తిచేసినట్లు సమాచారం. ఇప్పటికే పేరెన్నికగన్న కోడి పందాల శిబిరాల సమాచారం పోలీస్‌ల వద్ద ఉంది. ఎలాగూ రాష్ట్ర స్థాయి నుంచి చూసీ చూడనట్లు పొమ్మంటూ తమకు అందిన అనధికారిక సూచనలను కూడా కొందరు ఖాకీలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పేరుకే గ్రామ గ్రామానా కోడిపందాల నిరోధానికి ప్రత్యేక పోలీస్‌ పికెట్లు పెడుతున్నట్లు పత్రికా ప్రకటనలు వెలువడుతున్నాయి.

జిల్లాకు చెందిన ఓ పార్లమెంట్‌ సభ్యులు నేరుగా ఈ సంక్రాంతి సరదా సంప్రదాయ కోడి పందాలకు ముందస్తుగానే ఈసారి ఈ అనధికారిక అనుమతులను నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తోనే మంజూరు చేయించినట్లు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోడి పందాల కారణంగా పెద్ద సంఖ్యలో వచ్చే జనానికి మద్యం కిక్కు కూడా బలే గమ్మత్తుగా ఎక్కించేందుకు లిక్కర్‌ సిండికేట్లు కూడా తమవంతు పాత్రను పోషిస్తుంటాయి. అసలే ఈసారి భారీ ఎత్తున టెండర్లను కోడ్‌ చేసి షాపులను దక్కించుకుని లబోదిబో మంటున్న వీరు కోడి పందాల శిబిరాల వద్ద ప్రత్యేక అనధికారిక బెల్ట్‌ షాపులను పెట్టుకునేందుకు ఎకై్సజ్‌, పోలీస్‌ అధికారుల నుంచి అనధికారిక అనుమతులు అందుకున్నట్లు తెలుస్తోంది. వర్జీనియా రైతాంగం అకాల భారీ వర్షాలతో అప్పుల ఊభిలో కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో నేటి సంక్రాంతి కోడి పందాలు ఏ మేరకు విజయవంతం అవుతాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది.


కోడి పందాల శిబిరాలపై దాడులు నిర్వహిస్తాం :జంగారెడ్డిగూడెం డిఎస్‌పి రామకృష్ణంరాజు
సంక్రాంతి కోడి పందాల శిబిరాలపై పోలీస్‌ దాడులు కొనసాగుతాయని జంగారెడ్డిగూడెం డిఎస్‌పి రామకృష్ణంరాజు మేజర్‌న్యూస్‌కు స్పష్టం చేశారు. తమకు ఎలాంటి అనధికారిక అనుమతులు పైనుంచి అందలేదన్నారు. ప్రతి గ్రామంలోనూ ఓ కానిస్టేబుల్‌ను ఇందుకోసం ప్రత్యేక నిఘాగా పెడుతున్నామన్నారు. ముందస్తు సమాచారం ఉన్న శిబిరాల వద్ద పందాల నిరోదానికి ప్రత్యేక పోలీస్‌ పికెట్లను ఏర్పాట చేస్తున్నట్లు కూడా డిఎస్‌పి రాజు స్పష్టం చేయటం విశేషం. 
జిల్లాలో కోడిపందాలజోరు
పశ్చిమ గోదావరిజిల్లాలో సాంప్రదాయబద్ధంగా వస్తున్న కోడిపందాలు జోరు ప్రారంభమైంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గతంలో 15 రోజుల ముందు నుంచే కోడిపందాలు అటు మెట్ట ప్రాంతంలో, ఇటు డెల్టా ప్రాంతంలో ముమ్మరంగా జరిగాయి. అయితే ఇటీవల రైతాంగం తీవ్రంగా నష్టపోవడం, అధికార పార్టీలో వచ్చిన రాజకీయ విబేధాల ప్రభావం కోడిపందాలపై కూడా పడింది. అందువలన ఈ ఏడాది కొంతమేరకు కోడిపందాల సందడి తగ్గిందనే చెప్పాలి. దీనికి తోడు కోళ్ళకు కత్తులు కట్టే వారిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకుని బైండోవర్‌ కేసులు పెట్టడంతో కొంత కోడిపందాల సందడి సన్నగిల్లింది. అయినప్పటికీ ఒకవైపున పోలీసులు ఎదురుదాడి ప్రారంభించినప్పటికీ ఇటు చింతలపూడి పరిసర గ్రామాలలో, ఏలూరు పరిసర గ్రామాలలో, భీమవరం పరిసర గ్రామాలలో కోడి పందాల సందడి బుధవారం నుంచి ఆరంభమైంది. ఆకివీడు మండలం ఐ.భీమవరం, ఉండి మండలం మహదేవపట్నం, కాళ్ళ మండలం జువ్వలపాలెం పరిసర గ్రామాలలో కోడిపందాల జోరు ప్రారంభమైంది. దీనికి తోడు అక్కడ గుండాట, పేకాట తదితర ఇతర జూదాలు, మద్యం విక్రయాలు మొదలయ్యాయి. భీమవరం పరిసర ప్రాంతాలలో లాడ్జీలన్నీ నిండిపోయాయి. సంక్రాంతి పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాలలో ఉన్నవారు కూడా వచ్చి ఆనందంగా కోడి పందాల్లో పాల్గొనే సాంప్రదాయం ఆరంభమైంది.

అదేవిధంగా చింతలపూడి పరిసర గ్రామాలలో, సీతానగరం, నాగిరెడ్డిగూడెం, సీతంపల్లి తదితర గ్రామాలలో కూడా కోడిపందాలు ఆరంభమయ్యాయి. భీమవరంలోని ప్రకృతి శివారులో ప్రతీ ఏటా రాత్రింబవళ్ళు ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా కోడిపందాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉన్నదని, ఆ ముహుర్తానికి కోడి పందాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఏటా కోట్లాది రూపాయలతో జరిగే కోడిపందాలు ఈ ఏడాది కొంత తగ్గినప్పటికీ పై పందాలు కాసేవాళ్ళు ముమ్మరంగా ముందుకొస్తున్నారు. కోడిపందాలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడంతో పోలీసులు ఏం చేయాలా ? అని తల పట్టుకుంటున్నారు. ఏవిధంగా అడ్డుకున్నా యథావిధిగా కోడిపందాలు జరగక తప్పని పరిస్ధితులు జిల్లాలో నెలకొన్నాయి. 

పందెం కోళ్లు... 'జాతి'రత్నాలు

కోడి పందేలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పట్టణం, ఐ భీమవరం, జువ్వలపాలెం, ఉంగుటూరు తదితర గ్రామాలు ప్రధానం పెట్టింది పేరు. ఇక్కడ జరిగే పందేలకు లక్షలాది మంది పందెంరాయుళ్ళు

తరలివస్తారు. నాలుగు రోజుల పందేల జాతర కోసం వీళ్లు నాలుగు నెలల ముందు నుంచే తమ కోళ్లను సిద్ధం చేసుకుంటారు. ముందు నుంచే పందేనికి పనికి వచ్చే జాతి కోళ్లను సేకరిస్తారు. అలా సేకరించిన కోళ్లకు ప్రతి రోజూ ప్రత్యేకమైన ఆహారం పెట్టి పర్యవేక్షిస్తారు. కోడిపుంజుల్లో 17 రకాల జాతులు ఉన్నాయని చెబుతారు.

వాటిలో నల్ల నెమలి, కెక్కరాయి, గేరువా, రసంగి, నల్లతెమలా, పచ్చకాకి, మునగి, సేతూ, కౌజు, సరళ, ఇటుక డేగ, పెట్టమారు, డేగ, పర్ల, తెల్లపర్ల, నల్లజర్ల, నెమలి, మైలా, కాకి, పింగ్లా, అబ్రాస్, నేతువా, కేతువా, నల్లబొట్లు, పూల వంటివి ప్రసిద్ధ జాతులు. వీటి ధర రూ.5వేల నుంచి రూ.50వేల వరకు ఉంటాయి. 

No comments:

Post a Comment